- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- కోర్టుల్లో ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి
- పెండింగ్ కేసుల స్థితిగతులపై వారం రోజుల్లో నివేదిక అందించాలి
- జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్
SC, ST Atrocities meeting: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్తో కలిసి శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నియంత్రణపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాలు, అట్రాసిటీ కేసుల వివరాల ప్రస్తుత స్థితి గతులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్ శాఖల పరిధిలోని హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, స్టడీ సర్కిల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో నవంబర్ 30 నాటికి పెండింగ్ ఉన్న మొత్తం 30 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిపై కేసుల వారిగా వారం రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటివరకు సిరిసిల్ల జిల్లాలో మొత్తం 8 మర్డర్లు, 4 రేప్ కేసులు, 486 అట్రాసిటీ మొత్తం 498 ఎస్సీ, ఎస్టీ కేసుల ఫిర్యాదులు రాగా 5 కోట్ల 64 లక్షల 11 వేల 250 రూపాయల పరిహారం మంజూరు చేశామని, మరో కోటి రూపాయల 76 లక్షల 37 వేల 500 పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి కోర్టులలో సంబంధిత నేరస్తులకు శిక్ష పడే విధంగా ఆధారాలను సమర్పించాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయాలని కలెక్టర్ కోరారు. అట్రాసిటీ కేసులపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని అన్నారు.
పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న కలెక్టర్, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, వారు అందించిన సూచనలు పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్, సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొమ్ము బాలయ్య, అజ్మీర తిరుపతి, మెట్ట దేవానంద్, కొత్తపల్లి సుధాకర్, పాసుల బాలరాజ్, ఎన్జీవో సభ్యులు ఆలువల ఈశ్వర్, డప్పుల అశోక్, సిరిగిరి రామచందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.