CM Cup: నిర్మల్, డిసెంబర్ 3 (మన బలగం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం కప్ పోటీలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీఎం కప్ పోటీల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, ప్రభుత్వ వసతి గృహాల పర్యవేక్షణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మొదట గ్రామీణ స్థాయిలో పోటీలు నిర్వహించి, వాటిలో విజయం సాధించిన వారికి మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించాలని సూచించారు. పోటీల నిర్వహణకు గ్రామాల్లో ఆట మైదానాలను గుర్తించి, పోటీలకు సిద్ధం చేయాలన్నారు. క్రీడల నిర్వహణలో క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా త్రాగునీరు, టెంట్ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. క్రీడల్లో అధిక సంఖ్యలో యువత పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ స్థాయిలో నలుగురు సభ్యులతో కూడిన బృందానికి పంచాయతీ కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామీణ స్థాయి, 10 నుంచి 12 తేదీల్లో మండల స్థాయి, 16 నుంచి 21 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులంతా గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలోని పోటీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పోటీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ 97.22 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. డేటా నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కేజీబీవీ, వసతి గృహల్లోకి బయటి వ్యక్తులను అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. వసతి గృహ ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు వసతి గృహాలను తనిఖీ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, డిఆర్డీఓ విజయలక్ష్మి, డీఈఓ రామారావు, డిపిఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ గోవింద్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహా రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.