ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Whip Adluri Laxman Kumar: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి మండల స్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యారంగంలో ధర్మపురి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలతో పాటు నవోదయ పాఠశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.