- మహాశక్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతున్న భక్తగణం
- ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులు
- అలంకరణలో అదుర్స్.. హారతులు హైలైట్
- అర్ధరాత్రి వరకు అభిషేకాలు.. తెల్లవారి నుంచే దర్శన భాగ్యం
- భవానీ దీక్షాపరుల కోలాహలం
- వేలాదిమందికి నిత్యాన్నదానం
- దాండియాతో మహిళలు, చిన్నారుల సందడి
- వెలుగు జిలుగులతో అలరారుతున్న మహాశక్తి అమ్మవారి ఆలయం
Mahashakti temple: మనబలగం, కరీంనగర్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో దేవి నవరాత్రుల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ.. వరంగల్ భద్రకాళి.. ఏడుపాయల వనదుర్గాభవానీ జాతరకు జనం పోటెత్తడం సహజం. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. కనీవిని ఎరగని రీతిలో భక్త జన సందోహం తరలివస్తోంది. ఒకవైపు సామాన్య జనం.. మరోవైపు భవానీ దీక్షాపరుల కోలాహలం.. ఇంకోవైపు దాండియా కార్యక్రమాలతో కరీంనగర్ మహాశక్తి ఆలయం కన్నుల పండుగగా మారింది. మహిమాన్విత శక్తిస్వరూపిణిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే దాకా భక్తులు బారులు తీరుతున్నారు. ఇతర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో కరీంనగర్ మహాశక్తి ఆలయం జాతరగా మారింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయానికి విచ్చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
మహాశక్తి అమ్మవారి ఆలయ ప్రదాత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ దీక్ష చేపట్టిన బండి సంజయ్ ఉదయం నుంచి అర్దరాత్రి దాకా ఆలయంలోనే భక్తుల మధ్య గడుపుతూ అమ్మవార్లను సేవిస్తున్నారు. బండి సంజయ్ ఆలయంలోనే గడుపుతుండటంతో సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు సైతం భారీ ఎత్తున తరలివచ్చి తమ తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజ్ఞాపనలను అందజేస్తున్నారు. వీరందరితో ఓపికగా ముచ్చటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బండి సంజయ్.. వచ్చిన వారందరికీ అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మహాశక్తి అమ్మవార్ల అలంకరణ హైలైట్స్‌గా నిలిచింది. తెలంగాణలోని ఏ ఆలయంలోనూ లేని విధంగా మహాశక్తి అమ్మవార్లను అలంకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కర్నాటక నుంచి పూలు తెప్పిస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన పండితులు శ్రీవత్స ఆధ్వర్యంలో అలంకరణ బృందం అమ్మవార్లను రోజుకో అవతారంలో ప్రత్యేకంగా అలంకరిస్తోంది.
శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం నాడు శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిణి)గా భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న పూలు, పండ్లతో బాలా త్రిపుర సుందరి అవతారంగా అలంకరించగా, నేడు డ్రై ఫ్రూట్స్‌తో ముగ్గురు అమ్మలను అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామునే అలంకరణను పూర్తి చేసి భక్తులకు దర్శనం కావిస్తున్నారు. అంతేగాకుండా ప్రత్యేక రీతిలో 10 రకాల హారతులు ఇస్తున్నారు. అర్ధరాత్రి మహాశక్తి అమ్మవార్లకు చేసే అభిషేకాలు హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. రాత్రిపూట అమ్మవారి ఆలయంతో పాటు చుట్టూ పరిసరాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో వెలుగు జిలుగులతో జిగేల్ మంటున్నాయి. మహిమాన్వితమైన మహాశక్తి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రం నలువైపుల నుంచి తరలివస్తున్నారు. భక్తులతో మహాశక్తి ఆలయం జన సందోహంగా మారింది.
ప్రతిరోజు వేల మందికిగా నిత్యాన్నదానం
గతేడాదితో పోలిస్తే కనీవినీ ఎరగని రీతిలో వేలాది మంది భక్తులు భవానీ దీక్ష చేపట్టారు. మహాశక్తి ఆలయ సన్నిధిలోనే వేల మంది భక్తులు భవానీ దీక్ష చేపట్టారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ నిర్వాహకులు వీరందరికీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. భవానీ స్వాముల దర్శనంతో అమ్మవారి ఆలయం కోలాహలంగా మారింది. రాత్రిపూట మహిళలు, చిన్నారుల సందడి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారి సన్నిధిలో దాండియా ఆడుతూ సందడి చేస్తున్నారు. దాండియా కార్యక్రమాలను వీక్షించేందుకు వేల సంఖ్యలో మహశక్తి ఆలయానికి ప్రజలు తరలివస్తుండటం విశేషం.