Etala Rajender: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలచే తిరస్కరణకు గురైందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మహారాష్ర్ట ఓటర్లను ఉద్దేశించి మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘భారతదేశ ప్రజలచే తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్. ఎన్ని అడ్డదారులైనా తొక్కి, అలవికాని హామీలు ఇచ్చి, అధికారమే పరమావధిగా ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో గ్యారెంటీల పేరిట సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గేల చేత ప్రజాక్షేత్రంలో లక్షల మంది సమక్షంలో హామీలు ఇచ్చి అమలు చేయలేదు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. కర్ణాటక చేతులెత్తేసింది. తెలంగాణలో ఉచిత బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా అమలు కాలేదు. అలవి కానీ హామీలు ఇవ్వకండి అభాసుపాలు కాకండి అని వారి జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారో మళ్లీ మహారాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మేధావులు, ప్రజలు గమనించాలి. మహారాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైన వారు ఇలాంటి ప్రలోభాలను నమ్ముతారని నేను అనుకోవడం లేదు. బీజేపీగా వారి మోసాలను తిప్పికొడదాం. మహారాష్ట్ర ప్రజానీకానికి ఈ రాష్ట్రాల్లో జరిగిన మోసాలను అర్థం చేద్దాం. ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. ధర్మాన్ని కాపాడుకుందాం. భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం.’ అని మహారాష్ట్ర ప్రజలను ఈటల కోరారు.