- పది మీటర్ల మట్టినింపి ఆక్రమణ
- పట్టించుకోని అధికారులు
Darur Vaagu: జగిత్యాల, నవంబర్ 11 (మన బలగం): హైడ్రా జగిత్యాలకు ఎప్పుడు వస్తుందా.. ఆక్రమణల తొలగింపు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కల నెరవేరకముందే మరో వంతెన భూమి కబ్జా కోరుల చేతుల్లోకి చేరబోతుండగా అధికారుల పట్టింపు లేని ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంఘటన ఇది. జగిత్యాల నుంచి నర్సింగాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న దారిలో సాయి ఐటీఐ ముందు ప్రాంతంలో దరూరు వాగు నిర్మాణం గతంలోనే జరిగింది. ఈ వాగు పొడవు దాదాపు వంద ఫిట్లకు పైగానే ఉంటుంది. ఈ వాగుపై 1996లో అప్పటి చేనేత జాళి శాఖ మంత్రి ఎల్.రమణ చేతుల మీదుగా వంతెన నిర్మాణ పనులు మొదలవగా అప్పటి రాష్ట్ర సహకార శాఖ మంత్రి సుద్దాల దేవయ్య, జడ్పీ చైర్మన్ రాజేశం గౌడ్ల సారథ్యంలో ఈ వంతెన నిర్మాణము జరిగింది. కాలక్రమేణా ఈ వంతెన శితాలావ్యవస్థలోకి చేరుకొంటుంన్నా ఆ పరిసర గ్రామాల ప్రజలకు ఆ వంతెన సేవలాందిస్తూనే వస్తోంది. పాలకుల పట్టింపులేని ధోరణికి తోడు అధికారుల నిర్లక్ష్యం కాస్తా ఈ వంతెన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది.
దశల వారీగా ఈ వంతెన కింది వాగులో మట్టినింపుతూ కొందరు ఆక్రమణలకు తెరలేపారు. ఇలా దాదాపు 10 మీటర్ల లోతు వరకు మట్టిని నింపి కబ్జాకు ప్లాన్ చేశారు. ఇదే దారిలో ప్రజాప్రతినిధులు సమీప గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎన్నోసార్లు పోతున్నా ఈ వాగు కబ్జా అవుతున్న విషయంపై పట్టించుకోకపోవడపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కొద్దిపాటి వర్షాలు కురిసినా గోవిందుపల్లె ప్రధాన రహదారి బ్రిడ్జి మునిగిపోవడం పరిపాటి కాగా ఇదంతా చెరువులు, వాగులు కబ్జాకు గురికావడమేనని సంబంధిత అధికారులకు తెలిసినా మిగిలిన వాగులను, వంతెనల భూమి కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యతను మరవడమే ఈ కొత్త కబ్జాలకు కారణమని స్థానికులు అంటున్నారు. హైడ్రా రావాలి ఆక్రమణలను తొలగించాలని జగిత్యాల ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు దరూరు వంతెనను కబ్జా నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.