Whip Laxman
Whip Laxman

Whip Laxman: ఎల్లంపల్లి నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

Whip Laxman: ధర్మపురి, నవంబర్ 7 (మన బలగం): వెల్గటూర్ మండలంలోని చేగ్యం ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 18 కోట్ల రూపాయల నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను గురువారం చేగ్యాం గ్రామంలోని స్థానిక రైతు వేదిక వద్ద లబ్దిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ వంశీతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి మిగిలిన 63 మంది లబ్దిదారుల నష్ట పరిహారానికి చెందిన చెక్కులను ఎంపీ వంశి గారితో కలిసి పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తాతల కాలం నుంచి వస్తున్న భూములను ఈ ప్రాంత ప్రజలు కోల్పోయారని తెలిపారు. వారికి సంబంధించిన పరిహారం అందించే విషయంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చెగ్యం గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించడంలో కాక వెంకట స్వామి పాత్ర ఎంతో ఉందని తెలిపారు.

తాను జడ్పీ చైర్మన్‌గా ఉండి వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంత విషయంపై శ్రీధర్ బాబు దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినట్లు తెలిపారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో ముంపు బాధితులు పరిహారం కోసం చేసిన ప్రతి నిరసనలో, ధర్నాలో వారి వెంట తాము ఉన్నామని చెప్పారు. తాను ఎన్నికల సమయంలో గ్రామ బొడ్రాయి సాక్షిగా దశల వారీగా బాధితులకు పరిహారం ఇప్పిస్తాం అని ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అందని వారు ఉంటే వారికి సైతం పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో, మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *