- చెడి పోయిన బోరు
- 8 రోజులుగా తాగునీటి ఇక్కట్లు
- పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
- చెట్లకు పారని నీరు
Jagityal RTC Bus Stand: జగిత్యాల, నవంబర్ 15 ( మన బలగం): సూదుర ప్రయాణం చేసిన ప్రయాణికులు కొత్త బస్టాండ్‌లో బుక్కెడు నీరు తాగుదామని ఆశించినా ఆశ నిరాశే అవుతోంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ అలంకారప్రాయంగా మారింది. జగిత్యాల కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు వాటర్ కూలర్‌ను ఏర్పాటు చేశారు. గత వేసవి కాలంలో చల్లని నీటిని ప్రయాణికులకు అందించిన ఈ కూలర్ ఇప్పుడు తన సేవలను అందించడం మానేసింది. ఈ కూలర్‌కు, గార్డెన్‌లోని చెట్లకు నిరందించే మోటారు రిపేర్‌లోకి చేరింది. ఎనిమిది రోజులుగా ఈ మోటారు రిపేర్‌కు నోచుకోకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తాగునిటి కష్టాలు తొలగడం లేదు. ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు కొత్త బస్టాండ్ ద్వారా ప్రయాణిస్తుంటారు. అందులోను నిరుపేద, మధ్యతరగతి ప్రయాణికులే ఎక్కువ కావడం ఒకటైతే అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం మరొకటి. ఎనిమిది రోజులుగా ఎందరో ప్రయాణికులు తాగు నీరు బస్టాండ్‌లోని కూలర్ ద్వారా తాగు నీరు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ బోరు రిపేర్‌పై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలలోని ఆర్థిక ఇబ్బందులు వాటర్ బాటిల్ కొనుక్కోలేక తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని కొందరు ప్రయాణికులు అంటున్నారు. ఆర్టీసీ అధికారులు సత్వరమే స్పందించి వాటర్ కూలర్లో తాగునీటిని అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఔట్ సోర్సింగ్ కంట్రోలర్ తీరు వివాదాస్పదం
వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేసేందుకు జగిత్యాల కొత్త బస్టాండ్‌కు వస్తున్న ప్రయాణికులకు అక్కడ విధుల్లో ఉండే ఓ ఔట్ సోర్సింగ్ కంట్రోలర్ తీరు వివాదాస్పదంగా మారింది. బస్సుల సమాచారం కోసం అక్కడికి వస్తున్న ప్రయాణికులకు శాంతంగా సమాచారం ఇవ్వాల్సిన ఆ కంట్రోలర్ దురుసుగా సమాధానాలిస్తున్నట్లు స్థానికులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ సమస్యపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.