- ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలి
- సమీక్ష సమావేశంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
Minister Ponnam Prabhakar: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల పనితీరు, క్షేత్ర స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖల వారీగా సమగ్ర వివరాలు ఆరా తీశారు.
ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో కృషి చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సీఎం రాక నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దర్శనం ఏర్పాటు చేయాలని సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వేపై అపోహలు వద్దు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేపై ప్రజలు అపోహలు పడవద్దని మంత్రి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించి వారి వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవరైనా సర్వేపై అపోహలు, అభ్యర్థనలు లేవనెత్తితే ప్రభుత్వ అధికారులు స్పందించి సర్వే యొక్క ఆవశ్యకత గురించి క్లుప్తంగా వివరించి, వారి అపోహలను తొలగించాలని పేర్కొన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు, మిగితా వాటిలో కోత విధించమని స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బందులు రావద్దు
జిల్లాలోని రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం సేకరించి త్వరగా ఆన్లైన్ చేసి, డబ్బులు రెండు రోజుల్లో పడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సన్న ధాన్యం విక్రయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు సహకరించకపోతే ప్రత్యాయంగా గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ధాన్యం దించుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. వారిపై తమకు ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందేనన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందే పనులను వేగంగా చేపట్ట పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కోసం భూమి గుర్తించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కోసం భూమి గుర్తించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు ముందుకెళ్లాలని సూచించారు.
10,600 ఇండ్లు మంజూరు చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వేములవాడ నియోజకవర్గం మధ్యమానేరు నిర్వాసితుల కోసం 10,600 ఇండ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.