Collector Review: నిర్మల్, అక్టోబర్ 25 (మన బలగం): జిల్లాలో మాతృత్వ మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మాతృత్వ మరణాల నియంత్రణపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృ మరణాలను నిరోధించడానికి కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గర్భం దాల్చిన వెంటనే మహిళలకు పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య స్థితిని నమోదు చేయాలన్నారు. హై రిస్క్ గర్భస్థ మహిళలను గుర్తించి, దానికి అనుగుణంగా చికిత్సను తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. గర్భిణులకు పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. హై రిస్క్ గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటూ అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. హైరిస్కు గర్భిణులను గుర్తించేందుకుగాను గ్రామీణ స్థాయిలో ఏఎన్ఎం ఆశ, అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన శిక్షణలను ఇవ్వాలన్నారు ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, వైద్యాధికారులు సురేశ్, సౌమ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.