Laptops for students: తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రాష్ర్ట సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. పాఠశాలలకు ఆదరణ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నది. మధ్యాహ్నం భోజన పథకం విజయవంతంగా కొనసాగుతోంది. పాఠశాలల ప్రారంభానికి ముందే రాష్ర్టం వ్యాప్తంగా అన్ని స్కూల్స్ మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయి విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాపులు అందిస్తే విద్యాప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. విద్యార్థులు పాఠాలు చక్కగా అర్థం చేసుకొని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
రాష్ర్టంలో అన్ని మీడియంలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 30 వేలకుపైగా బడులు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 58,98,685 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు 29,66,994 మంది, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 18,26391, హైస్కూల్స్‌లో 11,05,300 మంది విద్యార్థులు చదువుతున్నారు.
దాదాపు 20 వేల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిశ్రీధర్ బాబు నోకియా సంస్థ ప్రతినిధులతో చర్చించారు. త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అన్ని పాఠశాలలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు సైతం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని సైతం త్వరలోనే పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.