- మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
- నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు, భవానీ స్వాములు
- భవానీ శరణు ఘోషతో మార్మోగిన అమ్మవార్ల ఆలయం
- అమ్మవారికి పసుపు, కుంకుమతో అలంకరణ
- భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం
Mahashakti Temple: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం (9 వ రోజు) శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు. దేవి దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్ర సహిత చండి హోమం నిర్వహించారు. అనంతరం సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు.
అభిమానులతో సెల్ఫీలు దిగారు. సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన మహిషాసుర వధ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ నాయకులు అభయ్ పాటిల్ తదితర ప్రముఖులు మహాశక్తి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల తర్వాత కేంద్రమంత్రితో కలిసి దాండియా కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. దాండియా కోసం మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.