International Day of Older Persons: నిర్మల్, అక్టోబర్ 1 (మన బలగం): వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు, దివ్యంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్ మైదానం నుంచి పెన్షనర్ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, తల్లిదండ్రులు, వయోవృద్ధులపై గౌరవంగా ఉండాలని, నిర్లక్ష్యం వ్యవహరించరాదని, వారిని ప్రేమ, ఆప్యాయలతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వృద్దులకు నష్టం జరిగినా, అన్యాయం, నిరాధారణకు గురి అయినా అధికారులను సంప్రదించాలని అన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వృద్ధుల స్థిర, చర, రక్షణ, మెయింటెనెన్స్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వృద్దులకు వారి హక్కులు, చట్టలపై పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం వృద్ధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు ఎంసీ లింగన్న, వివిధ మండలాల సీడీపీవోలు, రిటైర్డ్ ఉద్యోగులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.