Prajavani: నిర్మల్, డిసెంబర్ 16 (మన బలగం): ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రెవెన్యూ, భూ సంబంధిత తదితర సమస్యలపై ప్రజలు అర్జీలను సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న అర్జీలను వారంలోగా పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సంక్షేమ వసతి గృహాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన విద్య, భోజన వసతులు కల్పించాలని, గ్రామాలలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.