Abul Kalam Azad Jayanti: నిర్మల్, నవంబర్ 11 (మన బలగం): భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు.
ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు మహనీయుల చరిత్రను అందించిన వారమవుతామన్నారు. సేవలకు గుర్తింపుగా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడంతోపాటు విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, సీపీవో జీవరత్నం, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, మెప్మా పీడీ సుభాష్, మైనారిటీ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.