Australia vs England Highlights, T20 World Cup 2024: కెన్నింగ్ టన్ ఓవల్ బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ బౌండరీలు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో అయిదు ఓవర్లలోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 16 బంతుల్లోనే 39 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ నాలుగు సిక్సులు, రెండు ఫోర్లు బాదగా.. హెడ్ 18 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యారు.
ఇందులో హెడ్ మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. మిగతా బ్యాట్స్ మెన్ సమిష్టిగా పరుగులు చేసి ఆసీస్‌కు 201 పరుగుల భారీ స్కోరు అందించారు. మ్యాక్స్‌వెల్ 28, కెప్టెన్ మిచెల్ మార్ష్ 35, మార్కస్ స్టోనియిస్ 30 పరుగులు చేయగా, ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల స్కోరు అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ రెండు వికెట్లు తీసినా, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం 202 పరుగుల ఛేజింగ్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బట్లర్, పిల్ సాల్ట్ ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. సాల్ట్, బట్లర్ ఇద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలోనే స్కోరు బోర్డును 70 పరుగులకు చేర్చారు. 70 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యాన్ని అడమ్ జంపా బ్రేక్ చేశాడు. జంపా పిల్ సాల్ట్‌ను బట్లర్‌ను అవుట్ చేసి ఆసీస్ వైపు మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ కాసేపు బ్యాట్ ఝలిపించినా ఆ స్కోరు సరిపోలేదు. విల్ జాక్స్, లివింగ్ స్టోన్ తక్కువ పరుగులకే ఔట్ కాగా, బ్రూక్ క్రీజులో ఉన్నా వేగంగా ఆడలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేసి ఇంగ్లండ్ 36 పరుగుల భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.