Surya Kumar tweet viral: టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. పాకిస్తాన్, ఐర్లాండ్లతో జరిగిన మ్యాచుల్లో విజయం సాధించిన ఇండియా తాజాగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో విక్టరీ అందుకొని సూపర్- 8కు క్వాలిఫై సాధించింది. అక్కడి పిచ్ వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండడంతో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించడంలేదు. పరుగులు చేయడం బ్యాటర్లకు కత్తిమీద సాములా మారింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుండడంతో బ్యాటర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆచి తూచి ఆడితే తప్ప పరుగులు రావడం గగనంగా మారింది.
ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ తాజాగా సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో భారత్ గెలుపు సాధ్యమైంది. ఈ దశలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో కలిసి కలిసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను యూఎస్ఏ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ (Saurabh Netravalkar) అవుట్ చేసి భారత శిబిరంలో వణుకు పుట్టించాడు. కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరుగగా, రోహిత్ ఆరు బంతుల్లో మూడు పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
మ్యాచ్ సమయంలో సౌరభ్ కోసం సూర్యకుమార్ యాదవ్ చేసిన పదేళ్ల క్రితం ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘అవకాశాలు వాటంతటవే రావు.. మీరే సృష్టించుకోండి’ అని యూఎస్ఏ స్టార్‌తోపాటు మరొక స్నేహితుడిని ట్యాగ్ చేస్తూ సూర్య పోస్ట్ చేశాడు.
13వ ఓవర్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను సౌరభ్ డ్రాప్ చేశాడు. ఇదే ఆటను మలుపు తిప్పింది. యూఎస్ఏ పతనానికి కారణమైంది. ఆ సమయంలో సూర్య 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఇండియా విజయానికి 53 పరుగులు అవసరం ఉంది.
సూర్యకుమార్, సౌరభ్ ముంబై దేశవాళీ క్రికెట్ టీమ్‌లో జట్టు సభ్యులు. చాలా కాలంగా వీరు ఒకరికి ఒకరు తెలుసు. ఇద్దరూ కలిసి ఏజ్ గ్రూప్ మ్యాచులు ఆడారు. ‘వాస్తవానికి సూర్య సన్నిహిత మిత్రుడు. అండర్ 15 రోజుల నుంచి అతను తెలుసు. ఇద్దరం కలిసి ముంబై తరఫున మ్యాచులు ఆడాం. అండర్ 15, 17 మ్యాచుల్లో సెంచరీ, హాప్ సెంచరీలు చేయడంలో అతను ప్రత్యేకమైనవాడు.’ అని స్టార్ స్పోర్ట్స్‌లో నేత్రవల్కర్ అన్నారు.
‘నేను అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా సూర్యకు టీం ఇండియాకు ఆడే అవకాశం దక్కింది. నేను అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నా. సూర్యను కలవడానికి సంతోషిస్తున్నా. అతనే కాకుండా మేము ఆడిన చాలా మంది ఆటగాళ్లతో ఆడటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాం. సూర్యను ఎలా బయటకు తీసుకురావాలో ప్రస్తుతం నాకు తెలియడంలేదు. నేను నా పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తుంటాను. జట్టుకు నేను ఏమి చేయగలనో అని ఆలోచించి అదే చేస్తాను.’ అని నేత్రవర్కర్ ట్వీట్ జోడించారు.