teacher Sampath Kumar
teacher Sampath Kumar

teacher Sampath Kumar: జాతీయ ఉత్తమ పురస్కారానికి ఎంపికైన ఉపాధ్యాయుడికి కలెక్టర్ అభినందన

విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దిన దమ్మన్నపేట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్
మిషన్-100 పేరిట ప్రత్యేక కార్యక్రమం
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్వీకరించనున్న అవార్డు
రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక కాగా, వారిలో ఒకరు సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయులు
teacher Sampath Kumar: విద్యార్థులు స్వతహాగా వివిధ ఆవిష్కరణలు చేసేలా తీర్చిదిద్దుతున్న జిల్లా ఉపాధ్యాయుడు అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు. మిషన్ -100 అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎందరో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందేలా సిద్ధం చేసిన దమ్మన్నపేట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా వారిలో ఒకరు సంపత్ కుమార్. ఆయన ఎంపిక అవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు వెలికి తీసి, వారు ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తన చాంబర్‌లో అభినందించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలోనే కాకుండా అదనపు సమయంలోనూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ పిల్లల్లో భాష, గణిత నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని, ప్రభుత్వం కేటాయించిన సెలవులను వీలైనంత తక్కువగా వినియోగించుకొని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి అకింతభావంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపు ఇచ్చారు.

మిషన్-100 కార్యక్రమం

కనీసం వంద మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కర్తలుగా చేయాలనే సదుద్దేశంతో మిషన్-100 అనే కార్యక్రమాన్ని సంపత్ కుమార్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 53 మంది విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. ఇందులో 8 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి, 16 మంది జాతీయస్థాయి బహుమతులు గెలుచుకున్నారు.

ఇవీ ఆవిష్కరణలు

సంపత్ కుమార్ సారథ్యంలో విద్యార్థులు గైడ్ వెల్డర్లుకు ఉపయోగపడే హెల్మెట్ అనే ఆవిష్కరణ, జపాన్ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనందున రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీరిని అభినందించారు. ఇద్దరు విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు 2021, 2023 నందు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. అలాగే సంపత్ కుమార్ గైడ్ చేసిన ఆవిష్కరణలు వరుసగా నాలుగు సార్లు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికయ్యాయి. ఆయన మార్గదర్శనంలో విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు ఇండియాలో నిర్వహించే అన్ని వైజ్ఞానిక ప్రదర్శనల్లో జాతీయ స్థాయికి ఎంపికవడం విశేషం. విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంపత్ కుమార్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా సెప్టెంబర్ 5వ తేదీన అందజేయనున్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ఎ.రమేశ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *