- వివిధ పోటీ పరీక్షల్లో రాణించేలా తర్ఫీదు
- రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కేజీబీవీలలో ఐఐటీ, జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభం
- హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- ప్రభుత్వ సహాయం, కలెక్టర్ ప్రత్యేక చొరవతో షురూ
Whip Adi Srinivas: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కెజిబివి)లలో ఐఐటీ, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి కేజీబీవీల్లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమర్ ఝా కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చందుర్తి, మర్రిపల్లి లోని పాఠశాలలో స్టోర్ రూం, వంటగదులను, భోజనశాలను వారిద్దరు కలిసి పరిశీలించారు. నిత్యావసరాలను, బియ్యం, కూరగాయలను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. చందుర్తిలో టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని విప్ పేర్కొన్నారు. పాఠశాలలో పిచ్చి మొక్కలు, గడ్డి వంటి వాటిని తొలగించి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చందుర్తి కేజీబీవీ పాఠశాలకు నూతన రంగులు వేయాల్సిందిగా ఆదేశించారు.
విద్యార్థులను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. రుద్రంగిలోని కేజీబీవీలో ఇప్పటికే ప్రహరీ గోడ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని విప్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాజాన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కెజిబివి లలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఐఐటి, జేఈఈ, నీట్, యూజి ఫౌండేషన్ కోర్సులను ఆన్లైన్ కోచింగ్ , లైవ్ క్లాసెస్ చెప్పి, విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం, వారంతరాల్లో టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేజీబీవి లలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. డిల్లీ, హైద్రాబాద్, రాజస్థాన్, కోట లలో ఇచ్చే కోచింగ్ అన్ అకాడమీ సౌజన్యంతో ముందుకు పోతున్నారని తెలిపారు. కోచింగ్ సద్వినియోగం చేసుకొని ఐఐటి, జేఈఈ, నీట్ లలో సీట్లు సాధించాలనీ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారం అందించడానికి ఓకే మెను తయారుచేసి అందిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తుందని తెలిపారు. విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టినట్లు తెలిపారు. శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.10వ తరగతిలో 10/10 జి.పి.ఏ సాధిస్తే స్వయానా వచ్చి సన్మానం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సహాయంతో…జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో…ఐఐటి, జేఈఈ, నీట్, యు.జి. ఫౌండేషన్ కోర్సులను జిల్లాలోని కేజీబీవీపీలలో అందించడం జరుగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇచ్చే కోచింగ్ ప్రభుత్వ సహాయంతో కేజీబీవి లో అందిస్తున్నామని వివరించారు. తాను మధ్యతరగతి కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.ఈ కోర్సుల వలన మధ్యతరగతి కుటుంబాలలోని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో కోచింగ్ సెంటర్లలో లభించే కోచింగ్ కేజీబీవీ లలో లభిస్తుందని, వారు అనుకున్న లక్ష్యాలు చేరుకునే మంచి అవకాశం ఉందని తెలిపారు. దేశంలోనే ఉత్తమ సంస్థల్లో అందించే కోచింగ్ ను ఇక్కడ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, రుద్రంగి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చేలకల తిరుపతి, రోండి రాజు, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు ఉన్నారు.