Tribal Building: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గిరిజన భవనంలోకి చొరబడి విద్యుత్ బోర్డ్‌లను ధ్వంసం చేసి, ఫ్యాన్లను ఎత్తుకెళ్లిన నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రాజ్‌గోండ్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రం రాజేశ్వర్, ఆత్రం భీమ్రావు, జిల్లా నాయకులు మర్సకోల భీమ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం వారు భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. సంబంధిత అధికారులు, పోలీసులు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు గిరిజన భవనం వద్ద నిరంతరం పర్యవేక్షణ సిబ్బందిని ఉంచాలన్నారు. రాత్రి వేళలో పోలీసుల పెట్రోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవనం పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో మందుబాబులకు అడ్డాగా మారిందని అన్నారు. భవనం పరిసరాల్లో రాత్రి పగలు లేకుండా మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన బోర్డులను వెంటనే ఏర్పాటు చేయించి, ఫ్యాన్లను సైతం బిగించాలని కోరారు. లేనియెడల తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
