దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ
Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 12 (మన బలగం): ప్రభుత్వం నూతన పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ద్వారా వారికి స్వయం సమృద్ధి కల్పించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వీటి ద్వారా దివ్యాంగులు తమ దైనందిన జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చునన్నారు. భవిత సెంటర్ ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులు నిత్యజీవితంలో అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఆలింకో సంస్థ సహకారంతో జిల్లాలో అర్హులుగా గుర్తించిన 91 మంది దివ్యాంగులకు సుమారు 7 లక్షల 70 వేల రూపాయల విలువగల 133 ఉపకరణాలు వీల్ చైర్లు, శ్రవణ, దృశ్య, తదితర పరికరాలను కలెక్టర్ అందించారు. ఈ ఉపకరణాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, దివ్యాంగులు నిత్యజీవితంలో అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం పలువురు దివ్యాంగులతో మాట్లాడుతూ వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారికి అందజేసిన పరికరాలను సరిగ్గా ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ పి.రామారావు, ఎంఈఓ నాగేశ్వర్ రావు, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్, దివ్యాంగులు, పోషకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.