- గుట్టలు.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
- చేతులెత్తేసిన పారిశుధ్య కార్మికులు
- స్పందించని మున్సిపల్ అధికారులు
Nirmal Town: నిర్మల్ పట్టణం దుర్గంధం వెదజల్లుతోంది. ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు విధులను బహిష్కరించారు. నిర్మల్ మున్సిపాలిటీలో 365 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తుండగా వారికి మూడు నెలల వేతనాల బకాయి కోటిన్నర ఉంది. బకాయిలు చెల్లించాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందించకపోవడంతో పారిశుధ్య కార్మికులు చేతులెత్తేశారు. దీంతో నిర్మల్ పట్టణం కంపు కొడుతోంది. చెత్తను రోడ్లపైనే పడేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌ల ముందు చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అదేవిధంగా ఇళ్లలోని చెత్త సైతం ఐదు రోజులుగా నిల్వ ఉండడం వల్ల ఇళ్లలో కంపు కొడుతుందని పట్టణవాసులు అంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా బకాయిలు ఉన్న మాట వాస్తవమేనని, త్వరలోనే చెల్లిస్తామని చెప్పినప్పటికీ కార్మికులు చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని చెబుతున్నారని అన్నారు. త్వరలోనే బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేశారు.