Students request: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామడుగు మండలంలోని గుండి గ్రామ చెరువు మత్తడి పోయడంతో గుండి నుంచి లక్ష్మీపూర్, దత్తోజిపేట, చొప్పదండి, కరీంనగర్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, దత్తోజిపేట వివిధ గ్రామాల నుంచి గోపాలరావుపేటలోని వివిధ స్కూళ్లకు బస్సుల ద్వారా వచ్చే విద్యార్థులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని వస్తున్నామని, తమకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు రామడుగు మండల కేంద్రంలో పాత బ్రిడ్జి కొట్టుకుపోతే వానను సైతం లెక్కచేయకుండా నూతన బ్రిడ్జిని ప్రారంభించారని గుర్తుచేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి తమకు ప్రాణభిక్ష ప్రసాదించాలని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంను వివిధ స్కూళ్ల విద్యార్థులు వేడుకుంటున్నారు.