MINESTER CHANCE HOW
MINESTER CHANCE HOW

WAITING FOR MINISTER CHANCE: ఎట్లన్నా మంత్రినైతా!?

WAITING FOR MINISTER CHANCE: నేను ఎట్లైనా మంత్రిని గావాలే. అందు కోసం ఏం జెయ్ మన్న జేస్తా. మంత్రి కుర్చీలో కూసోవాలే గంతే..! ఆ..!! అంతే..!!! పదేళ్లైతుంది మన ప్రభుత్వం లేక. ఇప్పుడు ఇదే పార్టీ ఎమ్మెల్యేను నేను. అంటే పార్టీ మారొచ్చి గెలిసిన. అది వేరే సంగతి. ఇప్పుడు నా ఎయిమ్ అల్లా మినిస్టర్ కావడమే. బుగ్గ కార్ల తిరగడమే. కుయ్.. కుయ్.. అనుకుంట బుగ్గ కార్ల తిరిగితే ఆ లెవలే వేరప్పా..! ఆ రెస్పెక్టు.. దర్పం.. కండ్లు మూసినా.. తెరిసినా అదే సీన్ కనిపిస్తున్నది. స్టేట్‌ల యాడికి పోయినా మర్యాదకు కొదవుండదు. అందరూ సార్.. సార్.. అంటుంటే చెవులకు వినసొంపుగా ఉంటుంది. రాక రాక వచ్చిన చాన్స్. ఇది మిస్ జేస్తే మళ్లా నేను మినిస్టర్ అవుడు కలగానే మిగుల్తది.

దీని గురించే బాగా సోంచాయించినా. దిమాక్ మస్తు లడాయించిన. తిన్నా.. పడుకున్నా ‘నేను మంత్రి అవుడు ఎట్లా..?’ అనే థింకింగ్ జేసిన. అప్పుడే మిన్కుమిన్కు మంటూ ఓ సూపర్ ఐడియా తట్టింది. అంటే ఆ ఐడియా సూపరో కాదో నేనైతే జెప్పలేను. నాకైతే మస్తు వర్కవుట్ అయితదన్పించిది. ఐడియా తట్టంగనే ఎవల్కి కూడా జెప్పలే. ఆఖరుకు మా మినిస్టర్ అన్నకు కూడా జెప్పలే. దబ్బున వొయి సీఎం అన్నను కల్సిన. సెపరేట్‌గా కూసొని సీఎం అన్న చెవుల నా ఐడియా ఊదినా..! తమ్మీ.. ‘నువ్ గింత పనిమంతుడవనుకోలే..!’ అని అన్న నా భుజం తట్టంగనే నా కళ్లలో నీళ్లు సుడులు తిరిగినయ్..! నా కల నెరవేరే టైమొచ్చిందని గట్టి నమ్మకం ఏర్పడ్డది. మా జిల్లా నాయకులు, ప్రముఖ లీడర్లతోని సెపరేట్ మీటింగ్ పెట్టించిన. నేను సీఎం అన్న పక్కనే కూసున్న.

అప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన అన్న పక్కన ఎప్పుడు గిట్లనే సోపతి తీరంగ కూసోవాలంటే నేను మినిస్టర్ అవ్వాల్సిందే అని మరోసారి ఫిక్స్ అయిన. చెప్పుడు మర్సిపోయిన.. మీటింగుకు మా అన్నను పిల్వలే. మీటింగుల ఎంపీ అభ్యర్థి సీఎం అన్న ఎడం పక్కన.. నేనేమో కుడిపక్కన కూసొని స్పీచ్ షురూ చేసినం. ముందు సీఎం అన్న మాట్లాడిండు. నా ప్రపోజల్ ఎంపీ అభ్యర్థి, జిల్లా నాయకుల ముందు బెట్టిండు. కొందరేమో సరే అన్నరు.. మరికొందరేమో అట్లెట్ల కుదురుతది అనవోయి నోరు నొక్కేసుకున్నట్లు అనిపించింది. ఇంకొందరేమో సరే అన్నట్లో.. కాదు అన్నట్లో అర్థంకాకుండా తల ఆడించిండ్రు. ఆఖర్న నేను మాట్లాడిన. అందరి డౌట్లు క్లారిఫై జేసిన. ‘ఎంపీ అభ్యర్థిని గెలిపించే పూర్తి బాధ్యత నాది.. నా డిమాండ్ ఏంటంటే నాకు మంత్రి పదివి ఇయ్యాలే..!’ అని ముక్కుసూటిగ చెప్పిన.

కొందరు కన్వీన్స్ అయిండ్రు.. మరింకొందర్ని జెయ్యాలే. అది వేరే విషయమనుకో. ఎవరు ఊ కొట్టిండ్రు.. ఎవరు ఊ కొట్టలేదో నోట్ జేస్కున్న.. వాళ్లతోటి గూడా ఊ కొట్టిస్తా అని అప్పుడే డిసైడ్ అయిన. అప్పుడే సినిమాల్లో తరచూ వినిపించే డైలాగ్ గొర్తొచ్చింది. ‘ధనం మూలం ఇదం జగత్..’ అని. కొన్ని పనులు కావాలంటే తప్పదనిపించింది. మీటింగ్ అయి బయటకు వస్తుంటే మరో పాట గుర్తొచ్చింది. ‘బాబు వినరా..! అన్నా తమ్ముల అనుబంధం..’ ఎంటనే మా మినిస్టర్ అన్నకు ఫోన్ గలిపి విషయం జెప్పిన. విషయం పీక్ స్టేజ్‌ల ఉన్నప్పుడు నేనేం జేస్త తమ్మి అనుకుంట ఫోన్ పెట్టేసిండు. నాకేం అర్థం కాలే. సరేలే పెద్దోడు ఏం జెప్పినా మన మంచికే అని ఊకున్న.

నా ప్రపోజల్‌కు అధిష్టానం ఒప్పుకుందని ఒక పేపర్లో.. ఆలోచిస్తాం అని మరో పేపర్లో.. గోహెడ్ అన్నారంటూ మరో మీడియాలో.. పుంకాను పుంకాలుగా వార్తలొచ్చినయ్. మీటింగ్‌ల ఏం జరిగిందో మాకు తప్ప ఎవ్వరికి తెల్వదనుకున్న ఇప్పుడు అందరికి తెలిసింది..! అయినా నా ఎయిమ్ మార్చుకోను.. ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తా.. ఆయన్ను పార్లమెంటుకు పంపిస్తా.. నేను మంత్రి నైతా..! అంతే దటీజ్ ఫైనల్..! తగ్గేదేలే..!?

– A.V.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *