ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
Polasa Agricultural University: ధర్మపురి, డిసెంబర్ 13 (మన బలగం): జగిత్యాల పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేసారు. పలువురు రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో తమను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశోధకుల ఆలోచనలకు అనుగుణంగా రైతాంగం ముందుకు వెళ్లాలని సూచించారు. రైతాంగం అధిక దిగుబడి వచ్చే వంగడాలు వాడాలని తెలిపారు. పొలాస కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కళాశాలకు సంబంధించిన పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మరియు రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.