- నిర్మల్ జిల్లా అధికారుల్లో దడ
- జిల్లాలో నకిలీ యాపారంపై కూపీ
- గత నెలలో కేసు నమోదు
- ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు
- నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ
Bit Coin: నిర్మల్, అక్టోబర్ 11 (మన బలగం): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బిట్ కాయిన్(Bit Coin) గొలుసు కట్టు వ్యాపారంపై ED (Enforcement Directorate) ఫోకస్ పెట్టింది. ఈడీ(ED) రంగంలోకి దిగడంతో నిర్మల్ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా సాగిన ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారి గుండెల్లో మళ్లీ దడ మొదలైంది. ప్రధానంగా ఈ వ్యవహారంతో అంట కాగిన జిల్లా స్థాయి అధికారుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రధానంగా విద్యాశాఖపైనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ వ్యాపారంలో పాలుపంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారికి విద్యాశాఖ ఉన్నతాధికారి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో జరిగిన బిట్ కాయిన్ వ్యాపారంపై ఈడీ దృష్టి సారించడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బిట్ కాయిన్ మనీలాండరింగ్ వ్యవహారంపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఈడీ దృష్టి సారించడంతో మరుగున పడ్డ కేసు మళ్లీ తెరపైకి రావడం హర్షించదగ్గ విషయం.
యూబిట్ కాయిన్‌పై ఈడీ నజర్
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన బిట్ కాయిన్ వ్యాపారం పెద్ద మొత్తంలో నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ వ్యవహారంపై నిర్మల్ పోలీసులు దృష్టి సారించి గత నెలలో కేసులు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. దీంతో అనేకమంది అనేక రకాలుగా ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలోనే సంచలనం
నిర్మల్ జిల్లాలో జరిగిన బిట్‌కాయిన్ వ్యాపారం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. జిల్లా పరిధిలో సుమారు రూ.200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వ్యాపారం జరగడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ బిట్‌కాయిన్ వ్యవహారంపై పెద్ద మొత్తంలో వార్తలు ప్రచురితం కావడంతో ఈడీ దృష్టి సారించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది.
నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ
బిట్ కాయిన్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కేసు వివరాలు ఇవ్వాల్సిందిగా నిర్మల్ పోలీసులకు లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ నివేదిక, బిట్ కాయిన్ వ్యవహారంలో పాల్గొన్న వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి త్వరగా పంపించాలని ఈడీ లేఖ పేర్కొంది. దీంతో పోలీసులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన కేసు వివరాలను ఈడీకి పంపించనున్నట్లు తెలుస్తోంది.
నకిలీ యాప్ ద్వారా టోకరా
అయితే యూబిక్ కాయిన్ దందాలో నకిలీ యాప్‌ను ఉపయోగించి కోట్లు కొల్లగొట్టారు. ఈ దందాలో రూ.200 కోట్లకుపైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులే ఏజెంట్లుగా వ్యవహరించిన ఈ వ్యాపారంలో సామాన్యులను సునాయసంగా బురిడీ కొట్టించారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.15 వేల వరకు ఇంట్రెస్ట్ వస్తుందని ఆశ చూపారు. ప్రభుత్వ ఉద్యోగులే ఏజెంట్లుగా మారడంతో సామాన్యులు వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ ఎక్కువగా వస్తుందన్న ఆశతో కొందరు అప్పులు చేసి ఇందులో పెట్టుబడి పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా లావాదేవీలు జరిగిన ఈ చీకటి వ్యాపారంలో దుబాయ్‌లో లింకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెట్టుబడులు పెట్టిన వారికి యూజర్ ఐడీ పాస్ వర్డ్ ఇచ్చారు. దీంతో తమ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఫేక్ యాప్ ద్వారా దందాను నిర్వహిచడంతో లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నిండా మునిగిపోయారు.
ఖాతాలో వివరాలు చూయిస్తున్నా నకిలీ యాప్ అని తెలియడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా, ముధోల్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. నిర్మల్ జిల్లాతోపాటు చుట్టపక్కల జిల్లాల్లోనూ ఈ గొలుసుకట్టు వ్యాపారం విస్తరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ వ్యాపారం కొనసాగింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే రెండు వేల మంది వరకు బాధితులు ఉండగా రాష్ర్ట వ్యాప్తంగా చాలా మందే ఉంటారని తెలుస్తోంది. బిట్ కాయిన్ కేసులో గత నెలలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎక్సైజ్ ఎస్సై, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్‌ను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించి కూపీ లాగాల్సిన జిల్లా పోలీసు అధికారులు కేసును నీరు గార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం.