- రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు
- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్
Ex MLA Ravi Shankar: జగిత్యాల, అక్టోబర్ 19 (మన బలగం) : రైతు నేస్తమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించుకొన్న ఈ సర్కారు రైతుల పొట్ట కొడుతోందని, బోగస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసానే ఎగొట్టిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావ వసంత సురేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000 ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా, లేనట్టా అని ప్రశ్నించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందన్నారు. గడిచిన వానకాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని, రుణమాఫీ ఆగష్టు 15 లోపల చేస్తామని, సీఎం 40 లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ రుణమాఫీ, నాట్లు వేయడానికి ముందు రైతు బంధు, రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని అన్నారు. కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇదే విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే, కలెక్టర్లతో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్ని బ్యాగ్లు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కామ్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం 6గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు. దావ వసంత సురేశ్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చావు కబురు చల్లగా చెప్పిండన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. మూసీకి రూ.లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.
అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు. కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ తోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.