prajavani: నిర్మల్, అక్టోబర్ 28 (మన బలగం): ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒకే సమస్యపై ప్రజలు మళ్లీమళ్లీ దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటివరకు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని, దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.