Koppula: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన చెప్యాల పవన్ మీర్జంపేట గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ నక్కల వాగు దాటుతున్న క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించాడు. బాధిత కుటుంబాన్ని మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ ఓదెల జడ్పీటీసీ గంట రాములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతికి పలువురు మరణించారని తెలిపారు. ఆస్తినష్టం వాటిల్లిందని తెలిపారు. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం చెప్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పవన్ నక్కల వాగు దాటుతుండగా ప్రమాద వశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించడం బాధాకరమన్నారు. వరద బాధితుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తుందన్నారు.
ఖమ్మం, జనగామ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో 33 మంది ఈ వరదల్లో చనిపోయారని తెలిపారు. వరదలు వస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వెంట వెంటనే చర్యలు తీసుకొని సహాయ చర్యలు అందించారని తెలిపారు. గొప్పల కోసం ఆనాడు రేవంత్ రెడ్డి వరద బాధితులకు రూ.25 లక్షల పరిహారం డిమాండ్ చేశారని, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారని, వారికి పరిహారం కోసం రూ.25 లక్షలు ఇవ్వాలని ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు. వరదలతో చనిపోయిన 33 మందికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విహార యాత్రలకు వచ్చినట్లు మంత్రులు వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. ఖమ్మం ప్రజలు వరదల్లో చిక్కుకుని ఆదుకోమని ఆర్తనాదాలు చేసినప్పటికీ, ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక హెలికాప్టర్ సౌకర్యాన్ని అందించని పరిస్థితి దారుణమన్నారు. ఉద్యోగంలో విధులు నిర్వహిస్తు చనిపోయిన పవన్ కుటుంబం లో ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.