- ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకాక అవస్థలు
- ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాలు మారటం లేదు
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
AISF protest: జగిత్యాల, అక్టోబర్ 22 (మన బలగం): తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మూడు విద్యాసంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, భవన కిరాయిలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.
మూడు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, ప్రస్తుతం అధికారంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు టోకెన్ ఇచ్చినవి కాకుండా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు బకాయిల విడుదల అయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, చలో సచివాలయం నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అక్రమ్ మాలిక్ ఉపాధ్యక్షులు బచ్చల రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శి మచ్చ నితిన్, ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి మంద రాకేశ్, కౌన్సిల్ సభ్యులు వివిధ మండల కార్యదర్శులు అధ్యక్షులు రాజేశ్, పొన్నం వేణు, అంకటి ప్రణయ్, నరేశ్, ఫర్హాన్ అరవింద్, సోహైల్, ఆసిఫ్, నాగలక్షమి సౌమ్య శిరీష ఫర్హాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.