- ప్రజాపాలనలో అంతా పరేషాన్
- మీ పెద్ద కొడుకునై కొట్లాడుతా
- నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Nirmal MLA Eleti Maheshwar Reddy: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): ఎన్నికల సమయంలో గాలి మాటలు చెప్పిరి.. గత్తర గత్తర చేసిరి.. కుర్చీల కోసం అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చిరి.. ప్రజలను అయోమయంలో ముంచారు.. కొత్తపెళ్లి జంటలకు తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తానని అనిరి.. పింఛన్లు పెంచుతననిరి.. నిరుద్యోగులకు భృతి ఇస్తాననిరి.. చెప్పుకుంటా పోతే బారేడు లిస్టు ఉంది. బంగారం రాకుంటే రాకపోయే అచ్చిన లక్ష అయితే తీసుకోండ్రి అంటూ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యంగ్యంగా సర్కార్‌పై వీరుచుకపడ్డారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించారు. మీ సమస్యలపై పెద్ద కొడుకునై కొట్లాడి పరిష్కరిస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలు పరేషాన్‌లో పడ్డారని అన్నారు. అనంతరం నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సొన్, లక్ష్మణచందా, దిలావర్‌పూర్, నర్సాపూర్, మామడ మండలాలకు చెందిన 289 లబ్ధిదారులకు రూ.2 కోట్ల 89 లక్షల రూపాయల, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు సత్యనారాయణ గౌడ్, అర్జుమన్ అలీ, భీమ్ రెడ్డి, మండల అధికారులు, జిల్లా మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.