MLC Jeevan Reddy
MLC Jeevan Reddy

MLC Jeevan Reddy: నిస్తేజంలో జీవన్ రెడ్డి.. రాజీనామా యోచన?

  • ఎమ్మెల్యే సంజయ్ చేరికపై అసంతృప్తి

MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం స్థానిక నేతలను కలవరానికి గురిచేసింది. 40 ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లోనూ జీవన్ రెడ్డి పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంలో సక్సెస్ అయ్యారు. అదే ధోరణి కొనసాగించి కేసీఆర్‌ను ఎదురించగలిగారు. ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తికి ఓటర్లు అనూహ్యంగా స్పందించి ఆయన ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోయడంలో జీవన్ రెడ్డి పాత్ర ఎంతైనా ఉంది. కరీంనగర్ జిల్లాలోనే బలమైన నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం కొనసాగించారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నానని, ఎమ్మెల్యే చేరిక విషయమై తనతో చర్చించకపోవడం బాధకు గురిచేసిందని ఆవేదన వెలిబుచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతాయని వెల్లడించారు. రాజీనామా విషయమై ముఖ్యకార్యకర్తలు, నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

బుజ్జగింపులు

జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం సాగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు సహా ఇతర కాంగ్రెస్ ప్రముఖులు బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకోవాలని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించినట్లు సమాచారం. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి రాజీనామాపై పునరాలోచించాలని కోరారు.

షాక్‌లో కార్యకర్తలు

జగిత్యాలలో అనూహ్య పరిణామంతో నియోజకవర్గం ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారిన విషయం తెలుసుకొని విస్మయం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. సంజయ్ కుమార్ చేరికపై అలక వహించిన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం కావడంతో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా వాహనాలు జీవన్ రెడ్డి నివాసం వైపు వెళ్లకుండా పోలీసు స్టేషన్ వద్దే నిలుపుదల చేయించారు. జీవన్ రెడ్డి నివాసానికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *