Cybercrime: జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలంలో ఓ యువకుడు సైబర్ వలకు చిక్కి రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తూ మినీ ఏటీఎం ద్వారా డబ్బులు ఇచ్చే వ్యక్తి కావడం గమనార్హం. ఓటీపీలు, ఏపీకే ఫైల్స్ ద్వారా డబ్బులు కొట్టేసే మోసగాళ్లు ఈసారి కొత్త తరహాలో మోసానికి పాల్పడ్డారు. ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న బాధితుడికి సోమవారం మధ్యాహ్నం ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్క్రీన్‌పై సమీపంలోని పెట్రోల్ బంక్ యజమాని పేరు వచ్చింది. దీంతో కాల్లో మాట్లాడిన వ్యక్తి కొన్ని డబ్బులు వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని, నీకు ఓ హోటల్ యజమాని వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పి కట్ చేశాడు. ఆలోపు అక్కడకు వచ్చిన హోటల్ యజమాని బాధితుడితో మాట్లాడమని ఫోన్ ఇవ్వగా అవతలి వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు రూ.60 వేలు పంపించాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాల్సిందిగా హోటల్ యజమానిని అడగగా అదేంటి 100 బిర్యానీలకు నువ్వు రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇస్తానంటే ఇక్కడికి వచ్చానని, తనకేమీ తెలియదని చెప్పడంతో ఆ యువకుడు ఖంగు తిన్నాడు. ఈ విషయంపై పెట్రోల్ బంకు యజమానిని అడుగగా అసలు ఆ నెంబర్ తనది కాదని అని తేల్చి చెప్పేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరితో మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి రూ.60 వేల కొల్లగొట్టాడు అని పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు.