- డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ
- ఇంద్రకీలాద్రి పండితుల వేదాశీర్వచనం
Pawan Kalyan, AP Deputy CM: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.47 గంటలకు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తనకు కేటాయించిన స్థానంలో ఆసీనులయ్యారు. ఇంద్రకీలాద్రి దేవస్థానం వేదపండితులు పవన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం పవన్ పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. పవన్‌కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్ర్త సాంకేతిక మంత్రిత్వ శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడకు చేరుకున్న పవన్ క్యాంపు కార్యాలయంలోకి మొదటి సారిగా డిప్యూటీ సీఎం హోదాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు, పలువురు మంత్రులతోపాటు పవన్ సోదరుడు నాగబాబు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా తన వదిన అందజేసిన పెన్నుతోనే పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకాలు చేశారు. ఫైళ్లపైనా అదే పెన్నుతో సంతకాలు చేశారు.