DTF: మనబలగం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే చేయడంలో ఎన్యూమరెటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున నిర్ణీత సమయంలో పూర్తయ్యే అవకాశం లేదని, గడువును పొడిగించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కొక్క కుటుంబానికి 75 అంశాలతో కూడిన ప్రశ్నావళికి సమాచారం సేకరించడానికి చాలా సమయం పడుతున్నదని తెలిపారు. అదేవిధంగా సరైన ప్రచారం లేని కారణంగా, కుటుంబాల యజమానులు ఇండ్లలో అందుబాటులో ఉండడం లేదన్నారు. కుటుంబ యజమానులు ఉన్నా కూడా కొందరు సరిగా స్పందించడం లేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళలో సర్వే చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతునందున, ఉదయం పూట సర్వే చేసేట్లు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఎన్యూమరెటర్ల సంఖ్యను పెంచి, ఇండ్ల సంఖ్యను తగ్గించాలని వారు కోరారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే ఎన్యూమరేషన్ విధులు అప్పగించడంతో, ప్రాథమిక విద్య కుంటుపడే అవకాశం ఉందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, సర్వే యధావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.