Women’s Reservation Act: కరీంనగర్, నవంబర్ 16 (మన బలగం): జనగణన, నియోజకవర్గాల పునర్విభజనలతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మండ సదాలక్ష్మి డిమాండ్ చేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కిన్నెర మల్లవ్వ అధ్యక్షతన శనివారం జరిగిన సెమినార్లో పశ్య పద్మ, డాక్టర్ సదాలక్ష్మి, కొట్టె అంజలి, గరిగే శారద మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన పశ్య పద్మ మాట్లాడుతూ.. మహిళలకు రాష్ట్ర శాసనసభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని భారతదేశ మహిళలు 27 సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకుల నిర్లక్ష్యాన్ని సవాల్ చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య సుప్రీం కోర్టులో కేసు నమోదు చేసిందని తెలిపారు. దేశవ్యాపిత మహిళా ఉద్యమాలు, పోరాటాలు పాలకులపై ఉంచిన ఒత్తిడి, సుప్రీంకోర్టులో నమోదైన కేసు ప్రభావం పార్లమెంటులో చట్టం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
మహిళా రిజర్వేషన్ల చట్టం 2023ను అమలు చేయటానికి కేంద్ర పాలకులు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ కుంటి సాకులు చెప్పుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 అమలు చేయడంలో కేంద్ర పాలకులు పెట్టిన రెండు షరతులను ఉపసంహరించుకోవాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు. సమావేశ ప్రారంభంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జెండాను డాక్టర్ సదా లక్ష్మీ ఎగుర వేశారు. కేంద్ర పాలకులు పెట్టిన షరతులను తొలగించేంత వరకు పోరాటాలను ఉధృతం చేయాలని డాక్టర్ సదాలక్ష్మి మహిళా లోకానికి పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మహిళలను సమీకరించుకొని ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధమైతేనే పాలకులపై ఒత్తిడిని పెంచగలుగుతామని, శాసనసభల్లో పార్లమెంటు ఉభయ సభలలో 50% మహిళా రిజర్వేషన్లను ఆచరణలో అమలు చేయించుకోగలుగుతామని అన్నారు. గలిగే శారద, కొట్టే అంజలి మాట్లాడుతూ ఉద్యమాలకు సమాయత్తం కావాలని మహిళలను కోరారు. సెమినార్ అనంతరం జరిగిన నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో 9 మండలాల నుంచి పాల్గొన్న నాయకులు మహిళా సమాఖ్య సభ్యత్వం, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు.
జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ మాట్లాడుతూ ఇప్పటికే 9 మండలాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు సభ్యత్వాన్ని పూర్తి చేయటానికి కార్యక్రమంపై మాట్లాడారు. జిల్లా కమిటీలోకి నూతనంగా కమిటీ సభ్యులను తీసుకున్నారు. గత కమిటీలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు శారదను జిల్లా కార్యదర్శిగా పట్టణ కార్యదర్శిగా ఎలిసెట్టి స్వప్నను ఎన్నుకున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న యువ మహిళలను జిల్లా కమిటీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో జిల్లా మహిళా సమాఖ్య రాజకీయ శిక్షణ తరగతులను కరీంనగర్లో నిర్వహించటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో లక్ష్మి, వంకాయల లక్ష్మి, స్వరూప, సుగుణ, రాజేశ్వరి, శారద, పద్మలతోపాటు దాదాపు 100 మంది మహిళలు పాల్గొన్నారు.