Workshop on Children’s Literature: మనబలగం, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలసాహిత్యంపై కార్యశాల నిర్వహించారు. శ్రీవాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట పెందోట బాల సాహిత్యం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘బాల సాహిత్య కార్యాశాల’కు ప్రముఖ బాల సాహిత్య కవి, గేయ రచయిత పెందోట వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులకు బాల సాహిత్యంపై అవగాహన కల్పించడంతో పాటు కవితలు, గేయాలు, కథలు రాయడంలో మెళకువలు నేర్పించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థుల చేత అప్పటికప్పుడు కవితలు, కథలు రాయించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. బాల సాహిత్య కార్యశాల అనంతరం కవి, రచయిత పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘భలే భలే ఆటలు’ అనే నూతన పుస్తక సంకలనాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాషా ఉపాధ్యాయులు గొట్టిపర్తి భాస్కర్ ‘భలే భలే ఆటలు’ పుస్తకాన్ని సమీక్షిస్తూ విద్యార్థినీ, విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పెందోట వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడిగానే కాకుండా పిల్లల పట్ల తనకున్న మక్కువతో శ్రీవాణి సాహిత్య పరిషత్ లాంటి సాహితీ సంస్థను స్థాపించడం అభినందనీయమని పేర్కొన్నారు. పిల్లలకు బాల సాహిత్యంతో పాటు తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలను నేర్పిస్తూ, ఆయా పాఠశాలల పిల్లలను బాలసాహిత్యం వైపు ప్రోత్సహిస్తూ వారు రాసినటువంటి కవితలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. పిల్లల చేతుల మీదుగా ఆవిష్కరణలు చేయించడం, ఇలా తను రచించిన బాల సాహిత్య పుస్తకాలను పాఠశాలల లైబ్రరీకి అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి, ప్రముఖ కవి, రచయిత పెందోట వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు చిలుక వెంకటయ్య, మానుక శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ రెడ్డి, ఇర్రి రాజిరెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, నాగులపల్లి రాములు, నిమ్మ సురేందర్ రెడ్డి, పిడిశెట్టి నరేశ్, సుద్దాల రంజిత్ కుమార్, యామ రాజు, ఉపాధ్యాయినులు కె.సమత, సందిటి సులోచన తదితరులు పాల్గొన్నారు.