- 10 తులల బంగారం, పదివేల నగదు రికవరీ
- రెండు బొమ్మ తుపాకీలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్
Six accused arrested: బీర్పూర్, డిసెంబర్ 20 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని మండల కేంద్రమైన బీర్పూర్‌లో ఈనెల 13న తెల్లవారు జామున కాసం ఈశ్వరయ్య ఇంట్లో చొరబడి కొట్టి బొమ్మ తుపాకీతో చంపుతామని బెదిరించి, చేతులు కాళ్లు కట్టేసి బంగారం, నగదు దోచుకున్న నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య, బక్కెనపల్లి అరుణ్, యశోద శ్రీనివాస్, సైదు సహదేవ్, రత్నం మాణిక్యం మరియు ముకునూరి కిరణ్ కుమార్ ఒక గ్యాంగ్‌గా ఏర్పడి కొన్ని రోజుల నుంచి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రంతో గుప్త నిధుల కోసం వెతుకుతున్నారు. బీర్పూర్‌లో డబ్బులు, బంగారం ఉన్న వ్యాపారి కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఆయన, అతని భార్య మాత్రమే ఉంటారు. వారు ముసలి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడీ చేస్తే మనకు డబ్బు, బంగారు ఆభరణాలు దొరుకుతాయని పథకం రచించారు. ఈనెల 13న రాత్రి అందరూ మంకీ క్యాప్‌లు ధరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ ఒక నెంబర్ లేని వైట్ కలర్ ఏస్సెస్ 125 స్కూటీ, బ్లాక్ కలర్ ఫ్యాషన్ ప్రో బైక్‌ల మీద బీర్పూర్‌కు వెళ్లారు. అర్ధరాత్రి 2.30 గంటలకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుంచి గోడ దూకి బాత్రూమ్‌లో దాక్కున్నారు.
ఉదయం 5 గంటలకు ఈశ్వరయ్య బాత్రూమ్‌కు వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అదిమి పట్టి బొమ్మ తుపాకీతో తల మీద కొట్టి చంపుతామని బెదిరించారు. ఇంట్లోకి ఈడ్చుకెళ్లి ఈశ్వరయ్య, అతని భార్యను కొట్టి గుడ్డ పేగులు నోట్లో కుక్కి వారిని కట్టేశారు. వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడీ చేసి పారిపోయారు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు విచారణలో కొందరు నిందితులు ధర్మపురి మండలంలోని తుమ్మెనల గుట్ట దగ్గర ఉన్నారని సమాచారం మేరకు శుక్రవారం సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. దస్తురాబాద్ మండలం మున్యాల్‌కు చెందిన మున్నేసుల శ్రీనివాస్, లక్షెట్టపేట మండలం గోపవాడకు చెందిన చిప్పబత్తుల తులసయ్య, జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లికి చెందిన బక్కెనపల్లి అరుణ్, బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన యశోధా శ్రీనివాస్, ధర్మపురి మండలం తుమ్మెనలకు చెందిన సైదు సహదేవ్, జన్నారం మండలం మరిమడుగుకు చెందిన రత్నం మాణిక్యంలను అరెస్టు చేసారు. మంచిర్యాలకు చెందిన ముకునూరి కిరణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి బంగారు బ్రాస్లెట్ గొలుసు, పుస్తెలతాడు, ఉంగరం దాదాపు పది తులాలు ఉంటాయి. రూ.పదివేల నగదు, 6 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.