Chakali Ailamma Jayanti inspiration Telangana Nirmal: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని జిల్లా స్థానిక అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణా పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందని తెలిపారు. వెట్టి చాకిరి నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని వివరించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని అకాంక్షించారు. చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను నేటి తరం ప్రజలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రజక సంఘం అధ్యక్షులు సట్ల నర్సయ్య, శంకర్, సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.