Baala Shakthi: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కస్బా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య, నైపుణ్య అభివృద్ధికి బాలశక్తి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 52 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, క్షేత్ర పర్యటన అనుభవాలు, నైపుణ్య అభివృద్ధి, సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించడం బాలశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. విద్యార్థులకు వివిధ విభాగాల్లో నైపుణ్యాలను, నిత్యజీవితంలోని రోజువారి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
విద్యార్థులకు బ్యాంకింగ్ విభాగంలో అందించే వివిధ రకాల సేవలు, సైబర్ నేరాలపై అవగాహన, గ్రామ, మండల స్థాయిలో పౌర సేవలకు సంబంధించి అంశాలను వివరించడం, కలెక్టర్ కార్యాలయాల సందర్శన, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మీసేవ, అంగన్‌వాడీ కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలకు తీసుకువెళ్లి సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారుచేయాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యాధులు, ఒత్తిడిని జయించడం, స్వీయ రక్షణ వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని వెల్లడించారు. పాఠశాలల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ మండల స్థాయి అధికారులు, ఎన్జీవోలు, ఆశా కార్యకర్తలు, మహిళా స్వయం సంఘాలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బాలశక్తి కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటగా నిర్మల్ జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకు సేవల నిర్వహణ, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. వివిధ అంశాల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో బాలశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమాలలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, తహసీల్దార్ స్వాతి, ఎంఈవో శంకర్, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.