దీక్ష ఎప్పుడు చేయాలి? ఎవరు చేయాలి? ఫలితాలు ఎలా ఉంటాయి?
varahi ammavari deeksha: వారాహి మాత.. కోరిన కొర్కెలు తీర్చే అమ్మవారు. భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న కల్పతరువు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడ చూసినా ‘వారాహి మాత’ పేరే వినిపిస్తోంది. ఇంతకీ వారాహి మాత దీక్ష ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఏం ఆశించి చేస్తే ఫలితాలు ఉంటాయి? వంటి సందేహాలను వేదపండితులు నివృత్తి చేశారు.
గుప్తనవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
మనస్సులో బలమైన కోరికతో వారాహి అమ్మవారి దీక్ష స్వీకరిస్తే అనుకున్నది నెరవేరుతుంది. మాత అత్యంత శుభ ఫలితాలను కలుగజేస్తుంది. మనోభీష్టాలను సిద్ధంపజేసే కృపగల తల్లి వారాహి అమ్మవారు. ఈ మాత దీక్ష స్వీకరణకు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మాలధారణ చేస్తే అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. జూన్ నెలాఖరుతో ప్రారంభమై జూలైన 9వ తేదీ వరకు అమ్మవారి గుప్తనవరాత్రులు ముగుస్తాయి. ఈ గుప్తనవరాత్రుల గురించి ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు. చాలా కొద్ది మందికి మాత్రమే దీని ప్రత్యేకత గుర్తించి తెలుసు. నవరాత్రుల్లో ఎంతో మహిమాన్వితమైనది, శక్తిమంతమైనది ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులని పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారి దీక్ష స్వీకరించి కఠిన నియమోపాసనలు చేస్తే మాత కృపా కటాక్షాలు పొందవచ్చు.
మాలధారణ ఎవరు చేయాలి?
అంత్యత నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కరుణిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఈతిబాధలు తీరిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సప్తమాతృకలలో వారాహి మాత ఒకరు అని పురాణాల ప్రకారం తెలుస్తోంది. మాతా లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి మాత. అమ్మవారి ఉగ్రరూపంలో కనిపించినా మాత దయగల తల్లి. వారాహి ఆరాధ అందరూ చేయకూడదన్న అపోహ ఉండడంతో ఈ అమ్మవారి గురించి ఎక్కువగా ప్రాచుర్యంలేదు. అలాంటిది ఏమీ లేదని, అమ్మవారి ఉపాసన ఎవరైనా చేయొచ్చని వేదపండితులు స్పష్టం చేస్తున్నారు.
భూదేవిగా అమ్మవారు
కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలను దూరం చేసి రక్షణ కవచంలా అమ్మ వెన్నటి ఉంటుంది. ఎప్పుడూ ఒడిదుడుకులకు లోనయ్యే మనస్సును నియంత్రిస్తుంది. పరాధీనం కాకుండా ఆధీనంలో ఉంచుతుంది. వారాహి అమ్మవారు భూదేవిగా నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవతగా మరో రూపం ఉంది. పంటలు సమృద్ధిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు వారాహి మాతను పూజించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు.
అమ్మ అనుగ్రహంతో సకల శుభాలు
వారాహి దీక్ష చేసినవారు కోరుకున్నవన్నీ లభిస్తాయి. ప్రధానంగా భూ సమస్యలు పరిష్కారమవుతాయి. భూ తగాదాలు, కోర్టు కేసులు తీరిపోతాయి. శత్రు పీడ దూరమవుతుంది. అనారోగ్య ఇబ్బందులు నశించి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. జీవితంలో స్థిరత్వం లేకున్నా, మనకు రాక్షణ కావాలన్నా అమ్మవారి అనుగ్రహం పొందితే చాలు. ఇంట్లో తరచూ అశుభాలు కలుగుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పుల బాధలు తీరాలన్నా వారాహి మాత దీక్షతో దారి చూపుతుంది.
దీక్షలో అత్యంత కఠిన నియమాలు
దీక్ష తీసుకోవాలనుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దీక్ష దుస్తులు వేసుకోవాలి. అలా సాధ్యపడనివారు కండువాను తొమ్మది రోజులు ధరలించాలి. నిత్యం వారాహి మాత అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు ఉచ్ఛరించాలి. మాతకు కుంకుమార్చనలు చేయాలి. ఎర్రటిపూజలతో పూజ చేయాలి. దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించాలి. దీక్ష రోజుల్లో పాదరక్షలు వేసుకోకూడదు. మద్యం, మాంసాలకు దూరంగా ఉంటూ కఠిన నియమాలు పాటించారు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై చాప వేసుకొని పడుకోవాలి. అత్యంత కఠిన నియమాలు పాటిస్తూ అమ్మవారిని అనుక్షణం ధ్యానించాలి. అమ్మవారి మాలధారణ స్వీకరణ ఎంత కఠినంగా ఉన్నా శీఘ్రఫలితాలు లభిస్తాయి. పురాణాల ప్రకారం వారాహిమాత ధైర్యం, నిర్భయానికి ప్రతీతి. అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా సిద్ధిని పొందవచ్చు.
వారాహి మాలధారణలో పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాలధారణ, ఆయన ప్రచార రథానికి వారాహి పేరు పెట్టడంతో వారాహిమాత గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. వారాహి రథయాత్ర ద్వారా అఖండ విజయాన్ని అందుకున్న పవన్ ఇప్పుడు అమ్మవారి దీక్ష స్వీకరించారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగనుంది. దీక్ష సమయంలో పాలు, పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. గత ఏడాది జూన్‌లోనే పవన్ వారాహి రథయాత్ర నిర్వహించారు. యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో అప్పట్లోనే వారాహి మాత గురించి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాలధారణ స్వీకరించడం ప్రత్యేక సంతరించుకున్నది. దీంతో వారాహిమాత గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ ప్రేరేపితమైంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రస్తుతం అమ్మవారి నామస్మరణే వినిపిస్తోంది.