Nirmal Collector
Nirmal Collector

Nirmal Collector: దుర్గకు అన్ని విధాల అండగా ఉంటాం

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Collector: తల్లి మృతితో అనాథగా మారిన దుర్గకు అన్ని విధాలుగా అండగా ఉంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. తానూర్ మండలం బెల్ తారోడ గ్రామంలో తల్లి మృతితో అనథగా మారిన చిన్నారి దుర్గను శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో పెద్దమ్మ అనిత, గ్రామస్తుల సమక్షంలో కలెక్టర్ దుర్గకు 6వ తరగతిలో ప్రవేశం కల్పించారు. దుర్గ చదువుకు అవసరమైన బ్యాగులు, కాస్మోటిక్స్, దుస్తులు, నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దుర్గ ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారికి అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, వసతి గృహాలు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు.

ప్రతి రోజూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందించాలని ఆదేశించారు. నాణ్యమైన వస్తువులు, కూరగాయలను మాత్రమే వంటకు వినియోగించాలన్నారు. విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందించాలని, ప్రతిరోజూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, తానూర్ ఎంపీడీవో అబ్దుల్ సమద్, తహసీల్దార్ లింగమూర్తి, పట్టణ తహసీల్దార్ రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దేవి మురళీ, సగ్గం రాజు, శ్రీదేవి, ప్రిన్సిపాల్ గీత, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైద్య కళాశాల ఆకస్మిక తనిఖీ

జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని విద్య, వసతులు, ఇతర సమాచారాన్ని అధ్యాపకులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులు, ప్రాక్టికల్, ఫిజియాలజి, మ్యూజియం, డిసెక్షన్, వివిధ విభాగాలు పరిశీలించారు. వైద్య విద్యార్థుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యతోపాటు అన్ని విభాగాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలపై అధ్యాపకులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని వైద్య విద్యార్ధినిల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాళ్లు ధరహాస, దినేశ్ కుమార్, జిల్లా ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకులు సునీల్ కుమార్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Nirmal Collector
Nirmal Collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *