Wine shops closed: నిర్మల్, అక్టోబర్ 11 (మన బలగం): నిర్మల్ జిల్లాలో వైన్స్ షాపులు బంద్ అయ్యాయి. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్లో 12వ తేదీన, ముధోల్, భైంసాలో 13వ తేదీన దుర్గామాతల నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు వైన్స్ షాపులు మూసి ఉంచనున్నారు. నిర్మల్లో 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అలాగే భైంసా, ముధోల్లో 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచుతారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే మద్యం షాపులు మూసి ఉండడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ అంటేనే మద్యం, మాంసంతో ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగ రోజున ఆంక్షలు విధించడంపై అసహనం వెలిబుచ్చుతున్నారు. వైన్సులు బందు ఉండడంతో బెల్టుషాపులు కళకళలాడుతున్నాయి. మద్యం ప్రియులు అధిక ధరలు వెచ్చించి మరీ మందు కొనుగోలు చేస్తున్నారు.