Chalo Collectorate: జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన రైతు ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రైతు భరోసా ఎకరాకి రూ.15 వేలు వెంటనే జమ చేయాలని, అన్ని రకాల వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రైతులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షులు నల్ల రమేశ్ రెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, కాటిపల్లి ఆదిరెడ్డి, బందెల మల్లన్న, కొడిపెల్లి గోపాల్ రెడ్డి, పిడుగు సందన్న, వేముల కర్ణాకర్ రెడ్డి, నోముల నరసింహారెడ్డి, ఇప్ప రాజేందర్, ఎస్ఎన్ రెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.