CPI Karimnagar
CPI Karimnagar

CPI Karimnagar: అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట వేయడంలో మున్సిపల్ అధికారులు విఫలం

  • రోడ్డు పైకి వచ్చి నిర్మాణం చేస్తున్నా పట్టించుకోరా?
  • సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

CPI Karimnagar: కరీంనగర్, నవంబర్ 7 (మన బలగం): కరీంనగర్ నగరంలోని పదో డివిజన్‌లో అక్రమ కట్టడానికి అడ్డుకట్ట వేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఆరోపించారు. గురువారం ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ నగర పరిధిలోని పదో డివిజన్‌లో భూమి బకెట్ హాల్ పక్కన హనుమాన్ నగర్‌లో స్వశక్తి కాలేజీ నుంచి కోతి రాంపూర్ వెళ్లే బైపాస్ రహదారిపై బహుళ అంతస్తుల భవనం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి రోడ్డుకు ఐదు ఫీట్లు వెనుకకు జరిగి కట్టాల్సిన భవనం రోడ్డు వైపు 10 ఫీట్లు వచ్చి భవనం నిర్మిస్తున్నారు. అయినా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

భవనం అక్రమ నిర్మాణంపై గతంలో పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేద. గతంలో అక్రమ నిర్మాణంపై అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప చేసిందేమీ లేదు. ప్రధాన రహదారిపైనే ఇంత అక్రమ నిర్మాణం జరగడం మున్సిపల్ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. రోడ్డుపై చిన్న భవనాన్ని రెండు ఫీట్లు ముందుకు వచ్చి నిర్మిస్తే హుటా హుటిన అధికారులు వచ్చి కూలగొట్టిన సంఘటనలు కరీంనగర్‌లో కోకొల్లలుగా ఉన్నాయి. రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుకు నిదర్శనం. వెంటనే మున్సిపల్ కమిషనర్, అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలు పాటించని రోడ్డుపై నిర్మాణాలు చేస్తున్న పదో డివిజన్ భవనాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళన తప్పదని పైడిపల్లి రాజు అధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *