- బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఐకే రెడ్డి డుమ్మా
- హస్తం పార్టీలోకి వెళ్లేందుకు పావులు
- అడ్డుకుంటున్న లోకల్ లీడర్లు?
- ఒక్కొక్కరుగా అధికార పార్టీలోకి అనుచరులు
- భవిష్యత్‌లో లైన్ క్లియర్ కోసమేనా?
Allola Indrakaran Reddy: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. ఈయనకు అంగబలం, అర్ధబలం చాలానే ఉంది. ఈయన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఎన్నో పదవులు అనుభవించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా, మంత్రిగా పలు పదవులు అలంకరించారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండగా, రెండు పర్యాయాలు మంత్రి పదవులు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలవడం, రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఈయన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా..
బీఆర్ఎస్‌లో ఉండి రెండుసార్లు మంత్రి పదవి అనుభవించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మాజీ మంత్రి సందిగ్ధంలో పడ్డారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో స్థానిక లీడర్లు ఆయన చేరికకు అడ్డు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. అవినీతి, భూకబ్జాలు వంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని చేర్చుకోవడం మంచిది కాదనే భావనను చాలా మంది కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్థానిక నేతలు హైకమాండ్‌కు వివరించారు. దీంతో ఆయన చేరికపై ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో స్తబ్ధుగా ఉన్నారు. మరోవైపు అల్లోల బీఆర్ఎస్ పార్టీకి సైతం దూరం ఉంటూ వస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఆదిలాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హాజరుకాకపోవడంతో పార్టీ మారడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదటగా కేడర్.. ఆ తర్వాత ఐకే రెడ్డి..?
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు తిరుగులేని అనుచరగణం ఉండేది. ఆయన అనుచరులుగా చెప్పుకునే వారంతా కీలక పదవులు అనుభవించారు. అలాంటి వారు ప్రస్తుతం అల్లోలను వదిలి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ముఖ్యంగా ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చాలా రోజుల నుంచే జిల్లాలో ప్రచారం కొనసాగుతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ స్థాయి సమీక్షకు కూడా హాజరుకాలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరిక విషయంపై నిర్మల్‌లోని తన అనుచరులతో కూడా చర్చలు జరిపారు.
ఇంద్రకరణ్‌రెడ్డి సన్నిహితులైన ముథోల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌లో చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పది రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి కాంగ్రెస్‌లో చేరికపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావుతో పాటు సీనియర్లతో చర్చలు జరిపిన తర్వాతే ఇంద్రకరణ్‌రెడ్డిని చేర్చుకోవడమా? లేదా? అన్నది తేలనుంది. శ్రీహరిరావు వర్గం అంగీకరిస్తేనే ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లోనే శ్రీహరిరావును పిలిచి ఈ అంశంపై చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మల్ నియోజకవర్గ వ్యవహారాల బాధ్యత మొత్తం శ్రీహరిరావుకు అప్పగించేందుకు ఐకే రెడ్డిని అంగీకరిస్తేనే సయోధ్య కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చూద్దాం మరి.. అనుచరులు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారో?