గోపులాపూర్‌లో వైన్సుల సొంత వ్యాపారాలు
Wines sticker on liquor: జగిత్యాల ప్రతినిధి, జనవరి 23 (మన బలగం): సర్కార్‌కు ఆదాయం తెచ్చేందుకు జగిత్యాల ఆబ్కారీ శాఖ చేస్తున్న కృషిలో మందుబాబుల జేబులకు చిల్లుపడి మందు తాగినా మత్తెక్కక మండిపడుతున్న సంఘటన గోపులాపూర్‌లో నెలకొంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్‌లో ప్రభుత్వం మద్యం షాపులకు లైసెన్స్‌లను ఇచ్చింది. ఈ లైసెన్స్ పొందిన నిర్వాహకులు ప్రింట్ రేట్లకే వైన్సుల్లో మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కేవలం వినియోగదారులకే మద్యం విక్రాయించాల్సిన వీరు నిబంధనలను బేఖాతరు చేస్తూ బెల్ట్ షాపులకు మద్యం విక్రయాలను చేపడుతున్నట్లు తెలిసింది. ఇలా నిబంధనలను తుంగలో తొక్కుతున్న వీరు బెల్ట్ షాపులకు రక్షకులుగా నిలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బెల్ట్ షాపులకు విక్రయించే మద్యంలో బీర్లు, క్వాటర్‌లపై పది రూపాయలు అదనంగా వసూలు చేస్తూ బెల్ట్ షాపుల్లో తనిఖీలను ఆపడానికి ఈ అదనపు వసూళ్ల సొమ్మును ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇలా క్వాటర్‌పై పది రూపాయలు, ఆఫ్ బాటిల్‌పై ఇరవై, ఫుల్‌పై ముప్పై, లేదా నలభై లెక్కన వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
ఇదే క్రమంలో ఈ వైన్స్ ద్వారా బెల్ట్ షాపులకు విక్రయించే మద్యంపై ఆ షాపు షార్ట్ స్టిక్కర్‌లను అతికిస్తూ పోలీసులు, ఆబ్కారీ అధికారులకు అనధికార సంకేతాన్ని చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మందు బాబులపై వైన్స్‌ల వద్దనే అదనపు సుంకం పడుతున్నట్లు తెలుస్తోంది. వైన్స్‌ల వద్ద బెల్ట్ షాపులకు పడ్డ అదనపు సుంకానికి తోడు బెల్ట్ షాప్‌ల నిర్వాహకులు తమ వంతు అదనపు వసూళ్లకు తెరలేపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఒక్కో క్వార్టర్‌పై మరో పది, ఆఫ్‌పై మరో ఇరవై, ఫుల్ల్ బాటిల్‌పై నలభై చొప్పున వసూళ్లకు దిగినట్లు తెలిసింది. ఈ ప్రకారంగా రెండు వందల పది రూపాయలకు దొరికే ఒక క్వాటర్ బాటిల్‌పై వైన్స్‌ల పది రూపాయలు, బెల్ట్ షాప్‌ల పది రూపాయల వంతున కలిపి రెండు వందల ముప్పయి చొప్పున వసూళ్లకు దిగి మందు బాబుల మత్తు దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అనధికార పన్నులను నిరోధించడానికి ఆబ్కారీ శాఖ, పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై మండల పరిధిలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఓవైపు ఆబ్కారీ శాఖ ప్రభుత్వం విధించే టార్గెట్ల కోసం మౌనం పాటిస్తుంటే పోలీసుల ప్రేక్షక పాత్రతో మందు బాబుల జేబులకు చిల్లులు పడక తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆబ్కారీ శాఖ నివేదికల్లో డొల్ల
జగిత్యాల ఆబ్కారీ శాఖ తమ ఉన్నతాధికారులకు పంపే నివేదికల్లో అంతా ఫాల్స్ అనే ప్రచారం జరుగుతోంది. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే 100 నెంబర్ కైనా, టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలంటూ ప్రకటనలు ఇస్తున్న ఆబ్కారీ శాఖకు గోపులాపూర్‌లో మద్యం వ్యాపారుల అదనపు వసూళ్ల సంగతి తెలియదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తమ ఉన్నతాధికారులకు పంపే నివేదికల్లో గోపులాపూర్‌లో ప్రింట్ రేట్లకే మద్యం విక్రయిస్తున్నారన్నట్లు నివేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తేనే మందుబాబుల జేబులు సేఫ్ అనే టాక్ నడుస్తోంది.